. . . మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా ?
. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే ఊరుకోం
. . . బీఆర్ఎస్ అక్రమ సంపాదనతో జన సమీకరణ
. . . మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20 న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభనా..? బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా..? ప్రకటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్న తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ నెల 20 న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు క్లారిటీ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసిన డబ్బుతో జగిత్యాల సభకు జన సమీకరణ చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేవలం 12 వేల నుండి 15 వేల మందితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్ చార్జీని నియమించి జన సమీకరణ చేస్తున్నారని మంత్రి అన్నారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ వీడడం బాధాకరంగా ఉందని మంత్రి అన్నారు. పార్టీ వీడుతున్న జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పనిచేసిందని జీవన్ రెడ్డి అంటున్నారని మరి బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పని చేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి సాధించిందని, పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిందని మంత్రి వివరించారు. జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదని ఎందుకు రేవంత్ రెడ్డి దిగిపోవాలని మంత్రి ప్రశ్నించారు.