- శాఖా పరమైన చర్యలు ఎఫ్పుడు..?
- ఆరోపణలపై ఇటీవల ట్రాఫిక్ ఏసీపీ బదిలీ
- తాజాగా ట్రాఫిక్ కానిస్టేబుల్, హోంగార్డులు హెడ్ క్వార్టర్ కు అటాచ్
- ట్రాఫిక్ లో వసూళ్ల రాయుళ్లపై కమిషనరేట్ లో జోరుగా చర్చ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగిన వసూళ్ల పర్వంలో ఇద్దరు సిబ్బందిని బుధవారం అధికారులు హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేయడం కలకలం రేపింది. ఒక కానిస్టేబుల్, ఓ హోంగార్డు కలిసి ట్రాఫిక్ నియంత్రణ పేరిట పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా అటాచ్ చేస్తు ఉత్తర్వులు వెలువడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఇదే అవినీతి ఆరోపణలపై ట్రాఫిక్ ఎసిపిని బదిలీ చేయడం గమనార్హం. ట్రాఫిక్ లో విధులు నిర్వహణ ఒకప్పుడు పనిష్మేంట్ గా ఉండేది. కాని ప్రస్తుత కాలంలో ట్రాఫిక్ లో విధుల నిర్వహణ కోసం జోరుగా పైరవీలు, సిఫారసులు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ట్రాఫిక్ నియంత్రణ సంగతి దేవుడు ఎరుగు కాని దాని పేరుమీదా వసూళ్లు అదనపు ఆదాయంగా మారడమే కారణం. కొందరు ఎఆర్ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది గతంలో తాము అర్డిలరీ వ్యవస్థలో పనిచేయం మొర్రో అన్నవారు ఇప్పుడు డిప్యూటేషన్ పద్ధతిలో ట్రాఫిక్ లో విధులు అంటే ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వసూళ్లు చేస్తు దొరికిన పనిష్మేంట్ ఉండదని బదిలీ చేస్తు ఉత్తర్వులు ఉంటాయని చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతుంది…
నిజామాబాద్ ట్రాఫిక్ విబాగం వసూళ్లకు అడ్డగా మారింది అనే ఆరోపణలు కోకోళ్లలు. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. తదనంతరం సిఐ నియామాకం తరువాత కాలంలో తెలంగాణ ఏర్పాటు తరువాత ఎసిపి నియమాకంతో పరిది పెరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విధులు అనేవి ఒకప్పుడు లూప్ లైన్ కోసం అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే అవినితి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, ఎసిబి నజర్ ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లల చదువుకోసం, తమకు భవిష్యత్తులో వచ్చే పదోన్నతులలో ఎలాంటి ఫిర్యాదులు ఉండవద్ధని ట్రాఫిక్ లో డ్యూటీలు వేయించుకునే వారు. అంతే గాకుండా వందేళ్ల చరిత్ర కలిగిన ఇందూర్ నగరంతో పాటు బోదన్, ఆర్మూర్ ఏరియాలలో పెద్దగా రోడ్లు వెడల్పులు లేవు. జంక్షన్ లు లేవు. నిజామాబాద్ నగరంలో 14 జంక్షన్ లు ఉంటే 7 ప్రాంతాలలో మాత్రమే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. బోదన్, ఆర్మూర్ పట్టణాలలో సిగ్నల్స్ ఐదు మించి లేవు. గతంలో సిఐ వరకు పనిచేసిన చోట ఇప్పుడు ఎసిపి, సిఐ తో పాటు ఎస్ఐలు, ఎఏస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పనిచేస్తున్నారు.
ట్రాఫిక్ విబాగంలో విధి నిర్వహణ అనేది ఒకప్పుడు లూప్ లైన్ (పనిలేని) అనే రివాజు బద్దలు కొడుతున్నారు కొందరు. ఎందుకంటే తమ విభాగం అంటే ఫైన్ ల వసూళ్లకు పరిమితం అధికారులు పట్టించుకోరనే దిమాతో ఉన్నారు కొందరు. తాము పోలీస్ స్టేషన్ లలో పనిచేశామని అక్కడ ఆదాయం రాగా ట్రాఫిక్ లో ఎందుకు రాదు అనే శైలితో వసూళ్లకు కొత్త దారులు వెతుకుతున్నారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన ఒక అధికారి హోంగార్డులతో తన ఇంటివద్ద వంట పనిచేయించిన దాఖాలాలు ఉన్నాయి. మరో అధికారి పెద్ద శబ్ధం చేసే బైక్ ల సైలెన్సర్ లను తొలిగించి తనతో ముందస్తు ఒప్పంధం ఉన్న దుకాణాల వద్ద సైలెన్సర్ లు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చారు. గతంలో పండగల సందర్భంగా షాపింగ్ మాల్ వద్ద సిబ్బందికి టాన్ లకొద్ధి యూనిపఫాం బట్టలు తీసుకోవడం పై ఆరోపణలు వచ్చాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోదన్ లో ఇరుకు ప్రాంతాలలో రోడ్డు పై పార్కింగ్ విషయంలో యాజమానులతో ముందస్తు ఒప్పందంపై ఎప్పటి నుంచో ఆరోపణలు నెలవారీ వసూళ్లపై ఉన్నాయి. జిల్లా కేంద్రంలో తోపుడు బండ్లు మొదలుకొని ఆటోల సంఘాల వద్ద మామూళ్లపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇక ప్రముఖంగా హాస్పిటల్స్, షాపింగ్ మాళ్ల వద్ద సెల్లార్ లేకుంటే రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తే అక్కడ ఫైన్ లు వేయకపోవడంపై మతలబు ఉందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ సంస్థలు బారీకేడ్లను డిపార్ట్ మెంట్ కు అప్పగించి తమవైపు రావద్దని శరతులు పెడుతున్నారని ఏమైనా అంటే ఉన్నతాధికారులను బూచిగా చూపిస్తున్నారనే టాక్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే వారు పనిష్మేంట్ పై లోపలికి వెళ్లాల లేక పైన్ లతో తప్పించుకోవాలంటే అక్కడ వసూళ్లకు ప్రత్యేక వ్యవస్థ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
మొత్తానికి ట్రాఫిక్ విభాగంపై ఇటీవల కాలంలో ఎన్నడు లేని విధంగా ఆరోపణలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాని జిల్లాలో అక్కడ విధి నిర్వహణలో అధికారుల కారుణ్యం కుడా వారు వసూళ్లకు వాడుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. అవినీతి పరులపై కాఠిన్యంగా ఉండకుండా ఉదాసీనంగా ఉండటంపై పలు వాదనలు ఉన్నాయి. ప్రధానంగా అధికారులపై అనేక రకమైన ఒత్తిళ్లు కుడా కారణం అంటున్నారు అధికారులు. అందుకే చాల విషయాలు తెలిసిన చూసి చూడనట్టుగా ఉండటమే వారు చేస్తున్నారని, అతిగా వస్తేనే వారిపై చర్యలు తీసుకోకుండా బదిలీ చేసి మమా అనిపిస్తున్నారని ఖాకీలలో చర్చ జరుగుతుంది.