Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2025, 10:20 pm Posted by : ramakrishna

వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడ్డట్లేనా..?

  • ఇంచార్జి పాలన ఇంకెనాళ్లు..?
  • రెగ్యులర్ సూపరింటెండెంట్ ను నియమించరా..?

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ప్రతిమారాజ్ స్థానంలో పిల్లల వైద్య నిపుణులు ప్రొ.పి.శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టీనా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 10న ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న ప్రతిమారాజ్ తన పుట్టినరోజు వేడుకలను తన చాంబర్ లో అట్టహాసంగా జరుపుకున్నారు. 9న రాత్రి వచ్చిన పిట్స్ పేషెంట్ కు వైద్యం అందించకపోవడం కూడా ఆయన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి అనుబంధ సిహెచ్ఎన్ఐసీ యూనిట్ ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సూపరింటెండెంట్ తీరుపై మండిపడ్డారు. ఆనాటి నుంచే నాలుగు సంవత్సరాలుగా ఇంచార్జి సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న డా.ప్రతిమారాజ్ బదిలీ చేస్తారని టాక్ మొదలయింది. అయితే తనచాంబర్ లో జరుపుకున్న పుట్టినరోజు వేడుకలపై ఫిర్యాదుల పరంపర సీఎం పేషి వరకు వెళ్లడంతో ఉన్నఫళంగా కొత్త ఇంచార్జి సూపరింటెండెంట్ నియమించడం కలకలం రేపింది.

ఆది నుంచి వివాదాలకు  కేరాఫ్ గా ఇంచార్జి సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్ వ్యవహరించారు. ఆమెకు ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న కాలంలోనే కరోనా మహమ్మారి వైద్య సేవలపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా రెమిడేసివేర్ ఇంజక్షన్ ల దుర్వినియోగంపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా సూపరింటెండెంట్ తన సొంత ఆసుపత్రితో పాటు ఇతర కార్యకలాపాలు ఆసుపత్రి సిబ్బందిని వినియోగించారన్నఆరోపణలున్నాయి. అదే సమయంలో జిల్లా ఆసుపత్రిలో కరోనా కాలంలో రోగులకు అందించిన భోజనంపై ఫిర్యాదులు వచ్చాయి.  ఏకంగా కాంట్రాక్టర్, ఆసుపత్రి  అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దానితో పాటు మందుల కొనుగోళ్ళ వ్యవహరం అంతా అధికార యంత్రాంగానికి సంబంధం లేకుండా కొనుగోళ్లు  జరిగాయన్న వాదనలున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఆసుపత్రిలో ఆత్మహత్యల కేసులు పెరిగాయి. నిర్లక్ష్య వైద్యానికి కేరాఫ్ గా ఆసుపత్రి నిలిచింది. ఆసుపత్రి బాగోగులు పట్టించుకోవాల్సిన సూపరింటెండెంట్ సొంత వ్యాపకాలకు  ప్రాధాన్యత ఇచ్చారన్న వాదనలున్నాయి.

ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రతిమరాజ్ వ్యవహరించిన శైలిపై విమర్శలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఏనాడు కూడా వైద్యులు ధరించే డ్రెస్ కోడ్ (ఆప్రాన్) ధరించలేదన్న ప్రధాన ఆరోపణ ఉంది. అదే విధంగా ఆసుపత్రిలో రోగులకు  వైద్య సేవలకంటే ప్రైవేట్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చారనే వాదనలున్నాయి. ఏకంగా మీడియా ప్రతినిధులనే బెదిరించిన ఘటనలు లేకపోలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ముప్పతిప్పలు పెట్టారు. సమాచార హక్కు చట్టం కింద  రికార్డులు పరిశీలించకుండానే సీసీ కెమెరాలను ముందు పరిశీలన చేయాలన్న నిబంధన పెట్టడం గమనార్హం. ఆసుపత్రి వ్యవహరాలలో సూపరింటెండెంట్ కుటుంబ సభ్యుల జోక్యం, కాంట్రాక్టర్లతో చెట్టాపట్టాలు వేసుకుని వ్యవహరించడంపై ఆరోపణలున్నాయి. వివాదాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఆసుపత్రి పాలన అధికారి వివాదాల్లో మునిగి తేలడంతో ఆమెను ఉన్నఫళంగా తొలగించి కొత్త వారికి ఇంచార్జిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. 700 పడకల ఆసుపత్రికి దాదాపు 5  సంవత్సరాలుగా ఇంచార్జి  పాలన ఉండగా కొత్తగా కూడా రెగ్యులర్ అధికారిని  నియమించకుండా ఇంచార్జిని  నియమించడంతో ఈ పాలన మరెన్ని రోజులన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.