Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:36 pm Posted by : ramakrishna

క్యాంప్ కార్యాలయమా.. బీఆర్ఎస్ నాయకుల అడ్డానా..

 

. . . తంగళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బీఆర్‌ఎస్ నాయకుల అడ్డాగా మారిందని తంగళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించి, కార్యాలయ నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలందరికీ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయమని, అది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కార్యాలయం బీఆర్‌ఎస్ నాయకుల ఆధీనంలో ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిందిగా పేర్కొన్న ఆయన, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కార్యాలయంలో ఉన్న వ్యక్తులు ఎవరు, వారు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు, ఏ శాఖకు చెందినవారనే అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అధికారికంగా ప్రజలకు సేవలు అందించాల్సిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బీఆర్‌ఎస్ నాయకులకు లాడ్జిలా మారిందని వంశీ ఆరోపించారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టి, కార్యాలయాన్ని రాజకీయ ఆధిపత్యం నుంచి విముక్తి చేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.