Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 5:28 pm Posted by : ramakrishna

పీసీసీ అధ్యక్షుడి కి జాతీయ ఓబీసీ మహాసభల ఆహ్వాన పత్రిక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆగస్టు 7న నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభల ఆహ్వాన కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ, మండల్ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చిన రోజైన ఆగస్టు 7ను పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11వ జాతీయ ఓబీసీ మహాసభలు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది ఓబీసీల సమస్యల పరిష్కారంతో పాటు రాజకీయ సాధికారతే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ, బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఆహ్వాన కరపత్రాన్ని అందజేసిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమా రమేష్, డీసీసీ నగర అధ్యక్షుడు రామకృష్ణ బొబ్బిలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, శ్రీలత, సాయి బసవ, దారం భూమన్న, గంగాధర్, సత్యనారాయణ, అనిల్, శ్రీనివాస్, నరహరి తదితర బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.