Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 9:51 pm Posted by : ramakrishna

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

  • దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్
  • ఇద్దరు నిజామాబాద్ వాసులే

 

కరీంనగర్, బతుకమ్మ :కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన చోరీ సొత్తును తక్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని పోలీస్ లు అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసినట్టు కరీంనగర్ పొలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన టేకు చిరంజీవి ప్రస్తుతం ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లిలో ఉంటు కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లలో చోరీలకు పాల్పడ్డారు. టేకు చిరంజీవి (22) హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను పగలంతా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారు (టిఎస్16-ఎ 7015)లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని వేర్వేరు గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు.

  • దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్:

చిరంజీవి నుండి దొంగసొత్తు కొనుగోలు చేసిన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండల కేంద్రంలో బంగారు షాపు నడుపుకొని జీవిస్తున్న కొండూరు గ్రామానికి చెందిన బంగారు నరసయ్య (44)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను నందిపేటలో బంగారు షాపు నడుపుతూ తక్కువ ధరకు దొంగిలించిన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. చిరంజీవి అతని తండ్రి గంగ సాయిలు నర్సయ్యకు మే 10, 2025న సుమారు 66 గ్రాముల బంగారం విక్రయించారు. బంగారు నరసయ్య వారికి రూ. 1,14,000 చెల్లించినట్లు తెలిపాడు. పోలీసులు నిందితుల నుండి మొత్తం 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ. 1,00,000 నగదు, ఒక మొబైల్ ఫోన్, దొంగతనాలకు ఉపయోగించిన మారుతి ఫ్రాంక్స్ కారు, ఇనుప రాడ్లు, గ్లౌజులు వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమీషనరేట్ పరిధిలో దొంగతనాల నివారణకు పోలీసులు నిఘా పెంచుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఏసిపి వెంకటస్వామి, సి.సి.ఎస్ ఏసిపి జాన్ నర్సింహులు, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ ప్రకాష్, ఎల్.ఎం.డి. ఎస్సై శ్రీకాంత్,  క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ నరేష్, జైపాల్, సీసీఎస్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, వేణుగోపాల్, అనిల్, అవినాష్, లను కరీంనగర్ పోలీస్ కమిషనర్  ప్రత్యేకంగా పోలీస్ అభినందించారు.

Inter-district thieves arrested