. . . 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం
. . . ఐదుగురు నిందితుల అరెస్ట్
సదాశివనగర్, బతుకమ్మ :
అంతర్‌జిల్లా స్థాయిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్‌కు చెందిన హనుమంత్ రాజు తన బజాజ్ పల్సర్ బైక్ జులై 24న చోరీకి గురైనట్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో, సదశివ నగర్ సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్‌ఐ పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో షేక్ ఇమ్రాన్ (ఏ1), అద్నాన్ ఖాన్ (ఏ2)లు టీవీఎస్ రైడర్ బైక్‌పై తిరుగుతూ ఆసుపత్రులు, హోటళ్లు, రైల్వే స్టేషన్లలో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించేవారని తేలింది. వాటిని తక్కువ ధరకు సయ్యద్ జుబేర్ (ఏ4), షేక్ అయాన్ (ఏ5), సచిన్ (ఏ6)లకు విక్రయించగా, వారు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి ఎక్కువ ధరకు అమ్మేందుకు యత్నించేవారు. శనివారం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 3 పల్సర్ బైక్‌లతో పాటు నేరానికి ఉపయోగించిన ఒక టీవీఎస్ రైడర్ బైక్‌ను, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా పనిచేసి ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.