. . . అనుమతుల్లేని 9,10వ తరగతి క్లాసులకు సీజ్
బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని అభి ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 9, 10 తరగతులపై మండల విద్యాధికారి చందర్ చర్యలు చేపట్టారు. పాఠశాలను పరిశీలించిన ఎంఈవో 9, 10 తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం అనుమతులు లేని తరగతి గదులను సీజ్ చేశారు.ఇదిలా ఉండగా, పాఠశాల యాజమాన్యం టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. 9, 10 తరగతులకు ప్రభుత్వ అనుమతి లేదని, తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రిన్సిపల్ చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో చందర్ పాఠశాలలో 9, 10 తరగతులకు అనుమతులు లేవని నిర్ధారించి, ఆయా తరగతి గదులను సీజ్ చేసినట్లు తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.అధిక ఫీజులు వసూలు చేస్తూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ నాయకుడు సాయిబాబ డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.
