Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 1:10 pm Posted by : ramakrishna

రైతు మహోత్సవం ఏర్పాట్ల పరిశీలన

లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం

నిజామాబాద్, బతుకమ్మ  :  జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పరిశీలించారు. ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల  కొనసాగే ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరై వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. సహజసిద్ధమైన పద్ధతులలో పంటల సాగు, ఆధునిక యాంత్రీకరణ వినియోగం, ఆధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సాగు రంగానికి ఉపకరించే నూతన ఆవిష్కరణలతో కూడిన అధునాతన పరికరాలు, మేలురకం విత్తనాలను ప్రదర్శిస్తారని అన్నారు. వ్యవసాయం, అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, స్టార్టప్ కంపెనీలు, ఎఫ్పీఓలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు సాగు రంగంలో అవలంభించాల్సిన ఆధునిక విధానాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులను ఎలా తగ్గించుకోవడం, అధిక లాభాలను అందించే పంటలను ఎలా ఎంపిక చేసుకోవాలి తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు.  రైతు మహోత్సవ కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాల్ల్స్, వేదిక, షామియానాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుంచి హాజరైన ఏ.డీ.ఏ లు హుస్సేన్ బాబు, వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులున్నారు.

Inspection of the arrangements for the Farmers' Festival