- ఆదిలాబాద్ ఎపిటిఎస్ ఆధ్వర్యంలో..
ఇందూర్, బతుకమ్మ: పవర్ హౌస్ లో కొన్ని విభాగాలలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఆదిలాబాద్ ఎపిటిఎస్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో తిరగాల్సిన కొందరు, సంఘ నాయకుల సహకారంతో నిజామాబాద్ కాంపౌండ్ లో తిష్ట వేసారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్న సహోద్యోగులు, లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా ఆకాశరామన్న లేఖ ద్వారా కంపెనీ సిఎండికి పంపినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని ఆదిలాబాద్ ఎపిటిఎస్ అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం పవర్ హౌస్ కు చేరుకొన్నట్లు సమాచారం. ఎంఆర్టి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి క్షేత్ర స్థాయికి వెళ్ళకుండా కేవలం గుత్తేదారులకు సంబందించిన పనులు చక్కబెడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో హోదా పరంగా పైనున్న వారికి గాకుండా ఆ ఒక్కడికే విభాగం అధికారి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎంఆర్టి విభాగానికి ఏ అధికారి వచ్చినా, గుత్తేదారుల పనులను చక్కబెడుతున్న ఉద్యోగిని క్షేత్ర స్థాయికి పంపక పోవడం గమనార్హం. దీనితో పాటు హెచ్ టి మీటర్స్, ప్రొటెక్షన్ విభాగాలలో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.