Date of Publish : 19 December 2024, 12:47 amPosted by : ramakrishna
కస్టోడియల్ డెత్ పై విచారణ
కానిస్టేబుల్ సస్పెన్షన్
కొనసాగుతున్న విచారణ బోధన్, బతుకమ్మ : రెంజల్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యపై జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు వేర్వేరుగా విచారణ ప్రారంభించాయి. రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండకు చెందిన రెడ్యానాయక్ అనే వ్యక్తికి తన కిరాణా దుకాణంలోకి వచ్చిన మతిస్థిమితం లేని బాలికపై అఘాయిత్యానికి యత్నించడాని తాండ వాసులు చితకబాదిన విషయం తెల్సిందే. రాత్రివేళ రెడ్యానాయక్ ను తాండ వాసులు చితకబాదడంతో అతన్నిపోలీస్ స్టేషన్ కు తరలించిన రెంజల్ పోలీసులు తర్వాత బాధితుల ఫిర్యాదును స్వీకరించారు. అయితే గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు రెడ్యానాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కేసు నమోదు చేశారు. రాత్రికి రాత్రే రెడ్యానాయక్ పై ఫోక్సో కేసు కూడా నమోదు చేయడం విశేషం. అయితే ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం రెంజల్ పోలీస్ స్టేషన్ లో రెడ్యానాయక్ తన ప్యాంట్ నాడాతో లాకప్ సెల్ లో ఉరి వేసుకున్నట్లు గ్రామస్తులు ఆందోళన చేశారు. స్థానిక పోలీసులు చెబుతున్న వివరాల నమ్మశక్యంగా లేవని బాధితుడి భార్య అదే రోజు రాత్రి నిజామాబాద్ పోలీసు కమిషనర్ కు సిందూశర్మను కలిసి ఫిర్యాదు చేశారు. దానితో ఆమె సంబంధిత కేసు మీద విచారణకు తుఫ్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటికే రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఆ రోజు రాత్రి విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సైతో పాటు ఏరియా సిఐపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. అయితే కస్టోడియల్ డెత్ గా మారడంతో మేజిస్టిరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.