Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 5:22 pm Posted by : ramakrishna

నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించాలి

 

. . . రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి

 

. . . జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ సమాచార సేకరణపై కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఫీల్డ్‌ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. జనగణన–2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన విషయమై ఆమె శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందించేందుకు విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా , కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ చేతివృత్తులు,  గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలు, పరిశీలనలు వంటి తొమ్మిది ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలన్నారు.

 

Information must be collected accurately and with high quality.

 

అదేవిధంగా టౌన్ డైరెక్టరీ షెడ్యూల్‌ ను ఛార్జ్ ఆఫీసర్లచే(మున్సిపల్ కమిషనర్) నియమించబడిన అధికారుల ద్వారా పట్టణ పౌర, పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి ఛార్జ్ ఆఫీసర్లకు అందించాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల సమాచారాన్ని ఛార్జ్ ఆఫీసర్లు డీసీహెచ్ బీ పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి సమాచారాన్ని నాణ్యతతో నమోదు చేయాలన్నారు. విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 31.12.2025ను ప్రామాణిక తేదీగా తీసుకుని, రెవెన్యూ గ్రామాల వారీగా మొబైల్ అప్లికేషన్ లో సేకరించాలని సూచించారు. ఈ సమాచార సేకరణ ప్రక్రియ 10.08.2026 నుండి 08.09.2026 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి వెల్లడించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, విధానాల అమలు, పరిశోధనలు, పరిపాలనా అవసరాలకు డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్ ఒక ముఖ్యమైన ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా సమాచారాన్ని సేకరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, సీ.పీ.ఓ కిషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Information must be collected accurately and with high quality.