రెండు గేట్ల ద్వారా నీటి విడుదల…
నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆదివారం 330 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఈఈ సొలోమన్ తెలిపారు. కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల కాగా ప్రస్తుతం 408.00 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఎగువ నుండి నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 330 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాలతో వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తునందున ఆయకట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.