- దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు కాపాడటంలో సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకుల ప్రత్యేక చొరవ..
- ఏండ్లు గడుస్తున్న ఎడ్ల అరకతోనే వినాయకుని రథం ఊరేగింపు
- స్వతంత్రోద్యమం స్ఫూర్తితో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
నిజామాబాద్ సిటీ , బతుకమ్మ : దేశంలో, ఉమ్మడితెలుగు రాష్ట్రంలోనే ఇందూరు గణేష్ నిమజ్జన రథయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టిందే పేరుగా ఏండ్లు గడిచిన నిజామాబాద్ లో కొనసాగుతున్న రథయాత్రకు పేరుంది. ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎడ్ల అరకతోనే వినాయకుని రథం ఊరేగిస్తుంటారు ఇక్కడి సార్వజని గణేష్ మండలి కమిటీ నిర్వాహకులు. స్వతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ శోభాయాత్ర కొనసాగిస్తున్నట్లు సార్వజని గణేష్ కమిటీ సభ్యులు బంటు గణేష్ తెలిపారు. 1944 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు 11 మంది పెద్దమనుషులతో ఏర్పాటైన ఈ ట్రస్ట్ ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా అదే రీతిలో కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అప్పట్లో మొదట్లో 30 నుంచి 40 ఎడ్ల బండ్లు తో ఈ శోభాయాత్రను ప్రారంభించి ఆ విధంగానే ట్రాక్టర్లతో కూడా శోభా యాత్రను కొనసాగించే వాళ్ళమని ఆయన తెలిపారు. ఆ తర్వాత 1975లో జిల్లాకు చెందిన ఫర్టిలైజర్స్ వారు రథం తయారుచేసి తమ కమిటీకి అప్పజెప్పడం జరిగిందని, అప్పటినుంచి రథంలో గణేశుని కూర్చుండబెట్టి దుబ్బ ప్రాంతం నుంచి ఈ రథయాత్ర ద్వారా నగరంలోని ఆయా ప్రాంతాల గుండా ఈ శోభాయాత్రను నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. అప్పట్లో 30 నుంచి 40 వరకు ఎడ్లతో కొనసాగించే ఈ శోభాయాత్రను ప్రస్తుతం ఎడ్ల సంఖ్య తక్కువ కావడంతో 10, 12 అరకల ఎడ్లతో నిజామాబాద్ తో పాటు మరికొన్ని ఎడ్లను మహారాష్ట్ర నుండి కూడా ప్రత్యేకంగా శోభాయాత్ర కొరకు రథాన్ని లాగేందుకు తీసుకు వస్తున్నామని ఆయన అన్నారు. అందుకే ఇందూరులో జరిగే ఈ వినాయకుని శోభాయాత్రకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు సార్వజనిక్ కమిటీ నిర్వాహకులు
సెక్రటరీ శివ పవర్, క్యాషియర్ శ్రీనివాస్ లతో పాటు సార్వజనిక్ కమిటీ సభ్యులు ఈ రథయాత్రలో పాల్గొంటారని ఆయన అన్నారు.