. . . లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంతో కీలకమైన గృహ ప్రవేశాల మహోత్సవం నిజామాబాద్ జిల్లాలో సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసిన నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ, వారిచే సంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశాలు చేయించారు.

ఇందులో భాగంగానే మోపాల్ మండలం కులాస్ పూర్ లో చిక్కాల లక్ష్మి, రామడుగు సాయమ్మ, ఎస్. మేఘన, బి.ముత్తెన్న అనే లబ్ధిదారుచే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. రంగురంగుల పూలతో, మామిడి తోరణాలతో, అందమైన రంగవల్లులతో ఇందిరమ్మ ఇళ్లను చూడచక్కని రీతిలో లబ్ధిదారులు ముస్తాబు చేసుకుని తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. సొంతింటి కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గంకు సంబంధించి డొంకేశ్వర్ మండలం అన్నారంలో స్థానిక శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ లబ్ధిదారులచే గృహ ప్రవేశాలు చేయించారు. అదేవిధంగా బోధన్ నియోజకవర్గం పరిధిలోని నవీపేట, ఎడపల్లి, బోధన్, బోధన్ రూరల్, వర్ని మండలాల్లో, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ కు సంబంధించి 8వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ,గ్రామ గ్రామాన లక్ష ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప విషయం అని, ఇది తెలంగాణ పండుగ అని అభివర్ణించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తోందని అన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ప్రభుత్వ తోడ్పాటుతో దాదాపు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. కులాస్ పూర్ గ్రామానికి మొదటి విడతలో 47 గృహాలు మంజూరు చేశామని, ప్రస్తుతం మలి విడతలో అర్హులైన మరింత మందికి మంజూరు చేస్తామని అన్నారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలని గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, నాణ్యతతో కూడిన ఇందిరమ్మ చీరలు అందిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3304 ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుపుకుంటున్నామని వివరించారు.

లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. వివిధ దశలలో నిర్మాణాలలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని, బిల్లులను ప్రభుత్వం వెంట వెంటనే మంజూరు చేస్తోందని అన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, అందుకే అన్ని సంక్షేమ పథకాలను వారి పేరిటే మంజూరు చేస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి ధృవ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీ.ఆర్.ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ బాడ్సీ శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, హౌసింగ్ అధికారులు రాజ్యలక్ష్మి, నివర్తి, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, గ్రామ సర్పంచ్ జనార్ధన్, ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ రేఖ తదితరులు పాల్గొన్నారు.
