Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:56 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

. . . ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీఓలు, హౌసింగ్ ఏ.ఈలతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Indiramma should speed up the construction of houses

 

పనులు చేపట్టేందుకు సంసిద్ధంగా లేని వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి రద్దు చేసి, అర్హులైన కొత్త వారికి కేటాయించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు తలెత్తకుండా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఐకేపీ, మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. అయినా కూడా నిర్మాణాలను చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

 

Indiramma should speed up the construction of houses

 

నిర్ణీత గడువు దాటినా నిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారుల పేర్లను సైతం రద్దు చేసి, కొత్త వారికి కేటాయించాలని ఆదేశించారు. తదుపరి సమీక్ష నాటికి ఏ ఒక్క ఇల్లు కూడా నాట్ గ్రౌండింగ్ జాబితాలో ఉండకూడదని, లబ్ధిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. బేస్ మెంట్ లెవెల్ దాటిన ఇళ్లు అన్నీ నెల రోజుల్లో రూఫ్ లెవెల్ వరకు చేరుకునేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, హౌసింగ్ ఇంచార్జి పీ.డీ గంగాధర్, ఈ.ఈ నివర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏ.ఈ లు పాల్గొన్నారు.

 

Indiramma should speed up the construction of houses