నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
కొన్నేళ్లుగా గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు 35 కుటుంబాల కి పట్టాలిప్పించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని బాల్ నగర్ గ్రామ సర్పంచ్ కొమిరె రాజు ఎమ్మెల్యే ని కోరారు. జక్రాన్ పల్లి మండలం బాల్ నగర్ గ్రామ సర్పంచ్ కొమిరె రాజు నేతృత్వంలో గ్రామస్థులు శుక్రవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మహిళా భవనం, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ భవనాల గురించి విన్నవించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి రూ.24 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందని అందులో మహిళా భవనాలు, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో టాయిలెట్లకు సంబంధించిన పనులు ఉన్నాయని గుర్తు చేశారు.