Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:13 pm Posted by : ramakrishna

స్లాబ్ నిబంధనల మార్పుతో ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన

 

. . . బిల్లు విడుదల కాక రాస్తారోకో

 

. . . చేతులెత్తేస్తున్న అధికారులు

 

జుక్కల్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల నిర్మాణ వ్యయాన్ని నియంత్రించేందుకు స్లాబ్ నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేస్తూ జూన్ 27న కొత్త జీవోను విడుదల చేసింది. అయితే ఈ మార్పులపై హౌసింగ్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు లబ్ధిదారులకు సకాలంలో అవగాహన కల్పించకపోవడంతో జుక్కల్ మండలంలోని పలువురు లబ్ధిదారులు పాత విధానంలోనే స్లాబ్‌లు నిర్మించుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం స్లాబ్ నిర్మాణం లేకపోవడంతో సంబంధిత ఫోటో క్యాప్చర్ కాక, బిల్లులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బస్వాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాళ్లు, ముళ్లకంపలు వేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఇందిరమ్మ గృహాలను 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలు ముందే అమల్లో ఉండగా, స్లాబ్ నిర్మాణంపై స్పష్టమైన పరిమితులు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా పెద్ద స్లాబ్‌లు నిర్మించుకున్నారు. అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవోలో ముందు భాగంలో మూడు అడుగులు, మిగతా వైపులా ఒక్క అడుగు మాత్రమే స్లాబ్ పొడిగింపు ఉండాలని నిబంధన విధించింది. ఈ మార్పుల గురించి తెలియక ముందుగానే ఎక్కువ స్లాబ్ నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్లకు ప్రస్తుతం ఫోటో క్యాప్చర్ జరగక, బిల్లులు కూడా నిలిచిపోయాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతుండటంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసిన ఇళ్ల విషయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించి, బిల్లులు విడుదలయ్యేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.