Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 6:20 pm Posted by : ramakrishna

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

  • త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.  ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, మత్స్య శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను, వివిధ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు. స్వాతంత్ర్య సమర యోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద  మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Independence Day celebrations in full swing

పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట్ బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని స్నేహా సొసైటీ రూరల్ రికన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన దివ్యాంగులైన చిన్నారులు దేశభక్తి గేయాలపై ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పంద్రాగస్టు వేడుక శోభను మరింతగా పెంపొందింపజేసింది.

ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Independence Day celebrations in full swing