బాన్సువాడ, బతుకమ్మ :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విట్టల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆనంద్ పతాకావిష్కరణ చేశారు. అలాగే పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ తుల శ్రీధర్, రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ తిరుపతయ్య, ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ దిలీప్ కుమార్, విద్యుత్ కార్యాలయంలో ఏఈ సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మున్నూరుకాపు సంఘం వద్ద రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, ఫారెస్ట్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ హబీబ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తదితర కార్యాలయాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సీపీఐ కార్యాలయంలో దుబాస్ రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
