నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు వందేమాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ గేయాన్ని పాడుతూ జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు సుమన్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్య్రం సాధించిన అనంతరం 80 వసంతాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధిని కొనియాడారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో సాంకేతికతతో పోటీపడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రాష్ట్ర అభ్యున్నతికి ఉద్యోగులు తమ వంతు కృషి చేయాలని సుమన్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్, సలహాదారు వనమాల సుధాకర్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, సునీత, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, సర్వే స్పెషల్ యూనిట్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, ప్రకాష్, రాజేశ్వర్, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు గీతారెడ్డి, మంగమ్మ, విజయలక్ష్మి, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.