Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 2:50 pm Posted by : ramakrishna

సినిమా పాటల్లో అసభ్యంగా డ్యాన్స్ స్టెప్స్

స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తీవ్రంగా స్పందించింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు,సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరింస్తోందన్నారు. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్స్ ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమన్నారు. సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది సినిమా రంగం నైతిక బాధ్యత అని గుర్తు చేశారు. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చన్నారు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.