Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 9:28 pm Posted by : ramakrishna

చిన్నారి పట్ల అసభ్యకర ప్రవర్తన

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన వేధింపుల ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ వ్యక్తి చిన్నారిని వేధించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు ప్రాంతానికి చెందిన ఓ చిన్న బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అసద్ బాబా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆమెను గమనించాడు. అనంతరం చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి బాలికను పక్కకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, చిన్నారుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.