. . . ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పద్మ, ఎం.సుధాకర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర బడ్జెట్లో కేజీబీవీలకు నిధుల కేటాయింపు పెంచి నాన్ టీచింగ్, వర్కర్లకు వేతనాలు పెంచాలని టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో సమగ్ర శిక్ష అభియాన్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎల్ పద్మ, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ ఈసారి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో కేజీబీవీలకు నిధుల కేటాయింపు పెంచి, నాన్ టీచింగ్ సిబ్బందికి 24 వేల నుండి 32వేలు, వర్కర్లకు నెలకు 19 వేలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలపై వివక్షతను రూపుమాపడమే మా లక్ష్యం అంటూ సాధికారత కావాలని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళలపై తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నాయన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్, వర్కర్లకు ఇతర శాఖల రెసిడెన్షియల్ సిబ్బంది కంటే, ఆంధ్రప్రదేశ్ కేజీబీవీ సిబ్బంది కంటే కూడా అతి తక్కువ వేతనాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదన్నారు. వీరి వేతనాల పెంపు కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులకు, ప్రజా భవన్ లో అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, చివరకు ముఖ్యమంత్రి కి విన్నవించినా వేతనాలు పెంచకపోవడం, సమస్యలు పరిష్కరించక పోవడం అన్యాయమన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్, వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచి అమలు చేయాలన్నారు. వర్కర్లు పనిభారంతో అవస్థలకు గురై, అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹5 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వీక్లీ ఆఫ్, డ్యూటీచార్ట్ అమలు చేసి, పనిభారం తగ్గించాలన్నారు. హెచ్ఎంఎస్ విధానం అమలునుండి అకౌంటెంట్లను తప్పించాలని లేదా కేర్ టేకర్లను నియమించాలన్నారు. కంప్యూటర్, ఒకేషనల్ ఇన్స్ స్టక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. వర్కర్లకు నైట్ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియమింపబడి, సంవత్సర కాలంగా వేతనాలు రానివారి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బందికి కేజీబీవీ సిబ్బందికిస్తున్న పద్ధతిలోనే వేతనాలు పెంచివ్వాలన్నారు. గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. వీరి సర్వీస్ కాలానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజి మార్కులు ఇవ్వాలని, చాలా ఏళ్ళుగా అపరిస్కృతంగా ఉన్న వీరి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. అరుణ్ కుమార్ అరుణ, రాష్ట్ర నాయకులు హేమలత, లక్ష్మీ, సుమలత, సునీత, అలివేలు, లక్ష్మి, వీరమని, సుశీల తదితరులు పాల్గొన్నారు.