నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని 43వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంత గృహాలను అందించాలనే లక్ష్యంతో ఈ గృహాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ హాజరై లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. సొంత ఇల్లు పొందిన కుటుంబాల ఆనందంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల పథకం సామాజిక న్యాయం మరియు సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గృహ భద్రత కల్పించడం ప్రభుత్వ ముఖ్య బాధ్యతలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్, కేశ వేణు, అరెం గంగాధర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలుచ భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో తమ బాధ్యతను కొనసాగిస్తామని మేయర్ తెలిపారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత గృహ హక్కు అందే వరకు ఈ సంక్షేమ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.