- నీటి పారుదల శాఖ బలోపేతం కోసం సమూల ప్రక్షాళన
- శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కు పూర్వవైభవం చేకూరుస్తాం
- రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
మెండోరా, బతుకమ్మ : వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి,భూపతి రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి,లక్ష్మీకాంత్ రావు,నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్సారెస్పీ ద్వారా గడిచిన ఐదేళ్లుగా వానాకాలం,యాసంగి సీజన్లలో ఆయకట్టు పరిధిలోని పది జిల్లాలలో ప్రతి ఏడాది సగటున 12.5 లక్షల ఎకరాలకు సాగు జలాలు అందించగలిగామని తెలిపారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న సాగు,తాగునీటి వివరాలు ఎస్సారెస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను మంత్రి చర్చించి,అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం తీరుతెన్నులపై ఆరా తీశారు. ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు,ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని,ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత-చేవెళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామని అన్నారు.

సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరాంసాగర్,నిజాంసాగర్ ప్రాజెక్టులకు పూర్వవైభవం చేకూరుస్తామని అన్నారు. 112 టీఎంసీల నీటి నిలువ కెపాసిటీ కలిగిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 80టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్సారెస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిలువ సామర్ధ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోని నీటిపారుదల శాఖలో 700 మంది ఏ.ఈలను కొత్తగా నియమించామని1800 మంది లష్కర్లను పొరుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. మరో 1300 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశామని తెలిపారు. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుకు మేలు చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని మంత్రి ఉత్తంకుమార్ స్పష్టం చేశారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి,ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్,ఇరిగేషన్,సివిల్ సప్ప్లైస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
