బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం నుంచి ప్రతి రోజూ మొరం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు జేసీబీలను పెట్టి గత కొన్ని రోజులుగా మొరం అక్రమంగా తరలిస్తున్నారు. మొరం దందా తహసీల్, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో మూడుపూవులు, ఆరు కాయలుగా సాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి వేళల్లో మొరం డంప్ చేస్తూ లక్షల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నా మొరం వ్యాపారులు ఎటువంటి పర్మిషన్ లేకుండా అర్థరాత్రి దొంగల్లా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.