. . . అదనపు కలెక్టర్ భుజంగరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అన్నారు. పంటల మార్పిడి విధానం ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి వివరిస్తూ, రైతులు ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ, పంటల సాగు, సీజనల్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్య అభ్యసించే విద్యార్థులందరికీ 2 జతల ఏకరూప దుస్తులు ఆగస్టు 25వ తేదీలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ నినో వర్షబావ పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు వైపు అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని, కందులు, పెసర్లు, కూరగాయల పంటల సాగు శ్రేయస్కరం అని రైతులకు సూచించాలని తెలిపారు. సిజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వీ.సీ అనంతరం అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. ప్రతి రైతుకు అవగాహన కల్పించేలా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, భూగర్భ జల శాఖ అధికారులు కృషి చేయాలని, ప్రజాప్రతినిధుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందని, అర్హులైన ప్రతి రైతు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు నిర్ణీత గడువు లోపు అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారుల పరస్పర సమన్వయంతో పని చేస్తూ సకాలంలో విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు అందేలా కృషి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
