Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 8:08 pm Posted by : ramakrishna

ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించబడింది. జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, ప్రభుత్వ ఆదాయం పెంపు, అక్రమ తవ్వకాల నియంత్రణపై సమగ్రంగా చర్చించిన అనంతరం కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో “మన ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం లభిస్తుందని తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ప్రస్తుతం మంజీరా నదిలో ఐదు ప్రభుత్వ రీచ్‌లు అనుమతించబడినప్పటికీ అవి పర్యావరణ అనుమతులకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల నుండి అవసరమైన పర్యావరణ క్లియరెన్సులు పొందిన తర్వాత మాత్రమే ఆ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిర్వహించడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు చేపట్టరాదని కఠినంగా ఆదేశించారు. అదేవిధంగా మంజీరా నదిలో మూడు పట్టా భూములు జిల్లా కలెక్టర్ ఆమోదం పొందినట్లు తెలియజేసారు. వ్యవసాయ భూముల్లో ఉన్న ఇసుక మట్టెల తొలగింపు యాంత్రిక పద్ధతిలో కాకుండా కేవలం మానవ శక్తితో మాత్రమే నిర్వహించాలని, ట్రాక్టర్ల ద్వారానే రవాణా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 

Illegal sand transportation should be completely stopped.

 

ఈ ప్రక్రియకు మండల వ్యవసాయాధికారి, స్థానిక తహసీల్దార్ (ఎంఆర్ఓ)లకు అధికారాలు అప్పగించబడినట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి మాత్రమే ఇసుక తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలగకూడదని గట్టిగా సూచించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక లేదా గ్రావెల్ తవ్వకం, రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే సుమోటో కేసులు నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రవాణా లేదా తవ్వకాలు జరిగిన పక్షంలో సంబంధిత వాహనాలను సీజ్ చేయడం, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాల నియంత్రణపై కలెక్టర్ స్పందిస్తూ ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఈ బాధ్యత కేవలం రెవెన్యూ శాఖ, గనుల శాఖకే పరిమితం కాదని, పోలీసు శాఖ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కలిసి ఒకే వేదికపై పనిచేసి అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా, నియంత్రితంగా అమలు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్ ఏ.డీ సంజయ్ కుమార్, రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఆర్.డబ్ల్యూ.ఎస్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గ్రౌండ్ వాటర్, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Illegal sand transportation should be completely stopped.