- మల్లారం గాంధీనగర్ వద్ద భారీగా మొరం తవ్వకాలు
- రాత్రివేళ నగరానికి మొరం రవాణా
- జరిమానా విధించిన అటవీ అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం శివారులోని గాంధీనగర్ వద్ద మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రివేళ యథేచ్చగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. చింతల్ చెరువు శిఖంలో రెవెన్యూ భూమిలో రాత్రికి రాత్రి గుట్టను తవ్వేస్తున్నారు. హిటాచి మిషన్లను పెట్టి రాత్రివేళ తవ్వకాలు చేస్తూ నగరానికి మొరాన్ని తరలిస్తున్నారు. అందుకోసం రెవెన్యూ భూమిలో పెరిగిన టేకుతో పాటు ఇతర చెట్లను నరికివేసి తవ్వకాలు చేస్తున్నారు. గాంధీనగర్, మల్లారంకు చెందిన కొందరు మొరంను అక్రమంగా తవ్వకాలు చేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పని చేసిన పోలీసు కమిషనర్ పలువురిని అక్రమ మొరం దందాలో 5 లక్షల పూచికత్తుతో బైండోవర్ చేయగా వారే మళ్లీ దందాను మొదలుపెట్టారు. రాత్రివేళ భారీగా టిప్పర్లను రంగంలోకి దించి నగరానికి తరలిస్తున్నారు.

వర్ని రోడ్డులోని శివారులో గల 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే మొరం టిప్పర్లు నగరంలోకి దూసుకెళ్తున్నాయి. అక్కడ జరుగుతున్న మొరం తవ్వకాల గురించి నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ అనిరుద్ ను వివరణ కోరగా తాము చింతలచెరువు శివారులో ఎలాంటి మొరం తవ్వకాలకు అనుమతివ్వలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం విషయంలో పట్టపగలు తవ్వకాలు చేయాల్సిన వారు రాత్రిపూట చేస్తున్నారంటే అక్రమ తవ్వకాలేనని తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చింతల చెరువు శివారులో ఎస్ డబ్ల్యూఆర్ గోదాముల వద్ద జరుగుతున్న మొరం తవ్వకాలలో వనసంపద ధ్వంసం గురించి తెలిసిన అటవీ శాఖాధికారులు

గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పలు చెట్లను నరికివేసి కొన్నింటిని ధ్వంసం చేసి మొరం తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ జేసీబీతో జరుగుతున్న తవ్వకాల వలన చెట్లు ధ్వంసం అయినట్లు గుర్తించి రూ.5 వేల జరిమానా విధించినట్లు నిజామాబాద్ నార్త్ రేంజ్ ఎఫ్ఆర్వో సంజయ్ గౌడ్ తెలిపారు.

