- భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్
కామారెడ్డి, బతుకమ్మ : అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి కొంత మంది ఉపాధ్యాయులు కావాలని వారికి కావాల్సిన చోటకు డిప్యూటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వేసుకుంటున్నారని అన్నారు. గతంలో ఇదే విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కొన్ని డిప్యూటేషన్లను జిల్లా అధికారికి రద్దు చేయమని ఆదేశించారని తెలిపారు. ఒకటి రెండు మాత్రమే రద్దుచేసి మళ్లీ అదే విధంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ డిప్యూటేషన్ వలన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని అన్నారు. పిల్లలు ఉన్న పాఠశాలలో విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు పిల్లలు తక్కువ ఉన్న పాఠశాలలకు వారికి భారం కాకుండా చూస్తూ దూరప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందికరంగా ఉండడం వలన డిప్యూటేషన్ తీసుకుంటున్నారని అన్నారు. ఈ డిప్యూటేషన్ పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నాయని తెలిపారు. చాలామంది ఉపాధ్యాయులు సమయం పాటించకుండా ఇష్టం వచ్చిన టైంలో పాఠశాలకు వెళ్లి వస్తున్నారని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, బిజినెస్ లు చేస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారని పేర్కొన్నారు. దీంట్లో మండల శాఖ అధికారులు హస్తముందని తెలిపారు. అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని అలాగే విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవితేజ, జిల్లా ఉపాధ్యక్షులు అర్బస్ ఖాన్, ఇంచార్జ్ బుల్లెట్, నాయకులు శివ ,శ్రావణ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.