Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 5:20 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ కాలువ భూములపై అక్రమ నిర్మాణాలు

  •  “మనకు ఎందుకు?” అనే  ధోరణిలో అధికారులు
  • కాలువ  భూములను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు

 

నందిపేట్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నందిపేట, తల్వేద, వన్నెల్(కె) గ్రామ శివారులో గల  నిజాంసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-73 (డి-73) కాలువ భూముల పై  అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కొనసాగుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. వన్నెల్(కె) గ్రామంలో ఇప్పటివరకు డి-73 కాలువ భూమిని కబ్జా చేసి 50-60 ఇళ్లు నిర్మించారని గ్రామస్థులు తెలిపారు.

  • కాలువ భూముల ఆక్రమణ.. నిర్లక్ష్య ధోరణిలో అధికారులు..

కాలువ భూమిని సంరక్షించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అయినప్పటికీ, సంబంధిత శాఖలు ఏ చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. గ్రామ పెద్దలు, అధికారుల సహకారంతోనే ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వన్నెల్(కె) గ్రామంలో అనుమతి లేకుండా భారీ భవంతి నిర్మాణం జరుగుతుండగా, గ్రామ కార్యదర్శి నోటీసు జారీ చేసినప్పటికీ, నిర్మాణం కొనసాగుతోందని సమాచారం. అధికారుల బద్ధకం, నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ నిర్మాణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రజల ఫిర్యాదులు.. స్పందించని అధికారులు..

గ్రామ ప్రజలు కాలువ భూమిపై అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సంబంధిత శాఖలకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు సమగ్ర విచారణ లేదా నిర్మాణాల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. “కాలువ భూమిపై అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్న వారిపై నోటీసులు ఇచ్చాం, పనులు నిలిపివేశాం” అంటూ అధికారులు చెప్పినా, నిజంగా చర్యలు తీసుకున్నారా?” అనే ప్రశ్న గ్రామస్థుల నుంచి వస్తోంది.

  • హైదరాబాద్ తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణకు కఠిన చట్టాలు అవసరం”..

భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కబ్జాలను అరికట్టడానికి హైదరాబాద్ మాదిరిగా ప్రత్యేక చట్టాల అవసరం ఉందని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. “హైదరాబాద్‌లో భూముల రక్షణ కోసం హైడ్రా చట్టం అమల్లో ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కఠినమైన చట్టాలు అమలు చేయాలి” అని అభిప్రాయపడుతున్నారు.

Illegal constructions on Nizamsagar canal lands