. . . నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం
. . . బాలకార్మికులతో పని చేయిస్తున్న వైనం
. . . పట్టించుకోని అధికారులు
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి.ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొందరు యజమానులు దర్జాగా ఇటుక బట్టిలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నియోజకవర్గంలో సుమారు 30 వరకు ఇటుక బట్టీలు ఉన్నట్టు సమాచారం.వీటిలో సగానికి పైగా అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. రైతుల నుంచి వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని కొందరు వ్యాపారులు ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
. . . యథేచ్ఛగా వ్యాపారం . . . నిబంధనలు గాలికి
పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములకు వినియోగిస్తే నాలా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు పన్నుల చెల్లింపును పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ, భూగర్భజల వనరులు, పంచాయతీలు, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఎలాంటి అనుమనుతులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతూ చెరువులు, వాగులు, ప్రభుత్వ స్థలాల నుంచి ఇటుకలకు అవసరమైన మట్టిని సేకరిస్తున్నారు.దీంతో పాటు అటవీ ప్రాంతం నుంచి కట్టెలను సేకరించి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు.
. . . ఇటుక బట్టీల్లో మగ్గుతున్న బాల్యం
6 – 14 సంవత్సరాల లోపు పిల్లలంతా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లల బాల్యం బట్టీల్లోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేకపోవడంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోంది.