- ఓ అండ్ ఎం స్టాఫ్ సిబ్బంది కేటాయింపు ఎప్పుడో
- ఆందోళనకు సిద్ధమౌతున్న ఐఎన్టియూసీ
- ఒక్కరి కోసమే డిచ్ పల్లి డివిజన్ విభజన కు మీన మేషాలు
నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీయండి వరుణ్ రెడ్డి ఆదేశాలను నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖాధికారులు బేఖాతర్ చేశారు. ఏప్రిల్ 28 వరకు నిజామాబాద్ రూరల్ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని సీయండి చేసిన ఉత్తర్వులు చెత్త బుట్టపాలు చేశారు. 2022 లో పురుడు పోసుకున్న డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు జిల్లా అధికారుల తీరుతో ఒక్క అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. జిల్లా ఉద్యోగుల ప్రయోజనాల కన్న యూనియన్ నేతల ప్రయోజనాలకు అధికారులు పెద్ద పీట వేస్తున్న వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. యూనియన్ నేతలు తమకు ఉన్న ప్రొటేక్షన్ తో పోస్టింగ్ లు , పదోన్నతులు పొందడం సర్వసాధారణం కాని నిజామాబాద్ జిల్లాలో డివిజన్ ఏర్పాటుకు ఓకే ఒక్క యూనియన్ నేత కు ఎక్కడ రివర్షన్ ఇవ్వాల్సి వస్తుందో అని ఓ అండ్ ఎం స్టాప్ కేటాయింపులను తాత్సారం చేస్తుండటం పై జిల్లా విద్యుత్ శాఖాధికారుల తీరుపై కరెంటు ఉద్యోగులు మండిపడుతున్నారు.
2022 లో నిజామాబాద్ జిల్లాలో డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దాని ప్రకారం నిజామాబాద్ డివిజన్ లో ఉన్న రూరల్ ప్రాంతాలను కలుపుతు అందులో ఆర్మూర్ ఏరియాలోని కొన్ని కొత్త డివిజన్ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే యూనియన్ నాయకుల ప్రయోజనాల కారణంగా అది వాయిదా పడుతు వస్తుంది. గత కొంత కాలంగా ‘ బతుకమ్మ ’ దిన పత్రికలో వరుస కథనాల నేపథ్యంలో రూరల్ డివిజన్ ఏర్పాటుపై అధికారులలో కదలిక వచ్చింది. డివిజన్ ఏర్పాటుకు గల సందేహాలపై ఏకంగా జిల్లా విద్యుత్ శాఖ సూపరింటేండెంట్ ఇంజనీర్ సీయండికి లేఖ రాశారు. అందులో దాని విధి విధానాలపై వివరణ కొరకు సీయండి నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. ఈ విషయంలో డిఇ, ఎడిఇ, ఎఇలు, సబ్ ఇంజనీర్ లు, జేఎఓ, ఎల్ డిసీలు, యుడిసీలు, అటెండడర్ ల వరకు ఉద్యోగుల కేటాయింపు జరిగింది. కాని ఓ అండ్ ఎం స్టాప్ (క్షేత్రస్థాయి) సిబ్బందిని కేటాయింపులో మాత్రం తాత్సరం జరుగుతుంది. గత నెలలో 327(ఐఎన్ టియుసీ) నాయకులు సీయండిని కలిసి డివిజన్ విభజన పూర్తి చేయాలని లేకపోతే ఆందోళనకు దిగుతామని సమ్మె నోటిసును ఇచ్చారు. ఏప్రిల్ 28 వరకు పూర్తి అవుతుందని సీయండి హమీ ఇచ్చారు. కానీ ఆనాటి నుండి ఆఫైల్ ముందుకు కదల్లేదు. గడిచిన నెల చివరి వారంలో సీయండి ని అధికారులు కలిసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం..
డిచ పల్లి డివిజన్ ఏర్పాటులో ఓ అండ్ ఎం స్టాప్ కేటాయింపులకు ఒక యూనియన్ నేతకు రివర్షన్ వ్యవహరం అడ్డంకి ప్రధాన కారణం అని తెలిసింది. గతంలో పదోన్నతి పొందిన ప్రొటేక్షన్ కలిగిన యూనియన్ నేతకు ఖచ్చితంగా ఓ అండ్ ఎం స్టాప్ ల కేటాయిస్తే పూర్వస్థానానికి వెళ్లడం, రూరల్ ఏరియాకు బదిలీ తప్పదని చర్చ జరుగుతుంది. కాని ఒక్కడి కోసమే డిచ్ పల్లి డివిజన్ లో అన్ని శాఖల కేటాయింపు పూర్తైన ఒక్కరి కోసం కేటాయింపుల పై అధికారులు ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నారని చెప్పాలి. గతంలోను ఒక యూనియన్ నాయకుడు తనకన్న ఇద్ధరు సీనియర్లను కాదని తాను పదవి విరమణ కు ముందు పదోన్నతి తీసుకున్నారు అనే అపవాదు ఉంది. ఇప్పుడు ఏకంగా డివిజన్ ఏర్పాటుకు అడ్డంకిగా మారిన వ్యవహరంపై 327 యూనియన్ సీరియస్ గా ఉంది. ఇదివరకే సమ్మె నోటిస్ ఇచ్చిన సదరు నేతలు ఈ విషయంలో సీయండితోనే తాడో పేడో తెల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
