Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 2:41 pm Posted by : ramakrishna

గొర్రెపాటి మాధవ రావుకు ఐఎఫ్టీయు నివాళి

నిజామాబాద్, బతుకమ్మ : అలుపెరగని మానవ హక్కుల ఉద్యమ బాటసారి, సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల వేదిక తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవ రావుకు శనివారం ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో  నివాళులర్పించారు.  మరణించిన అనంతరం తన కళ్లను, పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు దానమిచ్చి మరణంలో సైతం ఆదర్శంగా నిలిచారని కామ్రేడ్ మాధవరావును వక్తలు కొనియాడారు.  ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు నాయకులు నీలం సాయిబాబా, శివకుమార్ లు మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు గొంతులేని పేద బడుగు  బలహీనవర్గాలకు, తాను గొంతై  వారి హక్కుల కోసం ఉద్యమించారని అన్నారు. నగరంలోని ద్వారక నగర్ గుడిసె వాసుల కోసం, శ్రామిక నగర్ గుడిసె వాసుల కోసం, పేదల ఇళ్ల స్థలాల కోసం కోర్టుల్లో పోరాడారని, వారికి ఇళ్ల స్థలాలు ఇతరత్రా సౌకర్యాలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య కు న్యాయ సలహాదారుడుగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక వేతన ఒప్పందాలకు మార్గదర్శకత్వం చేశారని శ్రామికుల కేసులను కోర్టులో ఉచితంగా వాదించారని తెలియజేశారు. బీడీ కార్మికుల రక్షణ కోసం, వారి వేతన పెంపుదల కోసం యజమాన్యాలతో పూణే, ఔరంగాబాద్, మహారాష్ట్రలో స్వయంగా వేతన చర్చల్లో పాల్గొని బీడీ కార్మికుల పక్షాన నిలిచారని వారి కోసం కోర్టుల్లో ఉచితంగా వాదించారని చెప్పారు. న్యాయవాదిగానే కాకుండా ప్రజల పక్షపాతిగా ఉంటూ అనేక సామాజిక సమస్యలపై రచనలు చేశారని, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని తెలియజేశారు. కామ్రేడ్ గొర్రెపాటి మాధవరావు మరణం పీడిత తాడిత ప్రజానీకానికి శ్రామిక వర్గానికి తీరనిలోటు  అని వారి ఆశయ సాధనకు అంకితం అవ్వడమే వారికి ఇచ్చే నివాళి ఆని అన్నారు. ఈనెల 11వ తేదీన నగరంలోని ఎల్లమ్మ గుట్టలో జరిగే మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, శంకర్, గణేష్, నర్సింగ్ రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.