. . . రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
నిజామాబాద్ , బతుకమ్మ :
దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన విలేజ్ డెవలప్ మెంట్ అరాచకాల రుగ్మతను దూరం చేయకపోతే భవిష్యత్తులో ఈ జాడ్యం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆవేదన వెలిబుచ్చారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ లో వీడీసీ 30 గౌడ కుటుంబాలను, 10 ఎస్సీ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన విషయంపై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకుని పరిష్కరించడానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ బుధవారం తాళ్ళరాంపూర్ లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జిల్లాలో సామాజిక బహిష్కరణ సంఘటనలపై బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర బీ.సీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం బుధవారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధితులతో భేటీ అయ్యింది. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 90 మంది బాధితులు కమిషన్ ప్రతినిధులను కలిసి తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతూఅనాగరికంగా వ్యవహరించే గ్రామ అభివృధ్హి కమిటీల ఆగడాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా ఇంకనూ పలు గ్రామాలలో సామాజిక బహిష్కరణలు, జరిమానాల పేరుతో సామాన్య ప్రజానీకాన్ని వేధింపులకు గురి చేయడం శోచనీయమన్నారు. ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. అనంతరం కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ బహిష్కరణ ఉదంతాలు చోటుచేసుకున్న ప్రాంతాల అధికారులతో క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిస్థితుల గురించి, వీ.డీ.సీలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తూ అరాచకాలకు పాల్పడే కమిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ జి.నిరంజన్ సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవడాన్ని తాము తప్పు పట్టడం లేదని, అయితే వీ.డీ.సీల ముసుగులో అమాయక ప్రజలను బహిష్కరణలు, జరిమానాలు విధించడాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.
. . . బాధితుల బాధలు కన్నీళ్ళు తెప్పించాయి
తమను కలిసి ఆవేదన వెలిబుచ్చిన బాధితుల బాధలు కన్నీళ్లు తెప్పించాయని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు అధికారులు సమిష్టిగా, అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీ.డీ.సీలు చట్ట పరిధిలో పని చేసేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని, దీనికోసం అదనపు కలెక్టర్, పోలీసు,రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదించారు. వీ.డీ.సీల అనైతిక చర్యలతో ఇబ్బందులకు గురి అయ్యే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. అవసరమైతే వారికి జిల్లా యంత్రాంగం ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు కళా బృందాల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.వీ.డీ.సీలు చట్టానికి లోబడి పని చేసేలా, పౌరుల హక్కులు పూర్తి స్థాయిలో పరిరక్షించబడేలా, గ్రామగ్రామాన ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని సూచించారు.
. . . త్వరలో అమలులోకి బీ.సీ ప్రొటెక్షన్ యాక్టు
ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం తరహాలోనే వెనుకబడిన తరగతుల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే బీ.సీ ప్రొటెక్షన్ యాక్టును అమలులోకి తేనుందని బీ.సీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ వెల్లడించారు. ఈ చట్టం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి బీ.సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన రూపంలో సమగ్ర నివేదిక సమర్పించిందని అన్నారు. బీ.సీ ప్రొటెక్షన్ యాక్టు అమలు పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, త్వరలోనే ఇది అమలులోకి రానుందని ఆశాభావం వెలిబుచ్చారు.
. . . జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీడీసీల ఆగడాలపై పటిష్ట చర్యలు
జిల్లాలో సామాజిక బహిష్కరణలు వంటి రుగ్మతలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కమిషన్ చేసిన సూచనలను అమలు చేస్తూ, అరాచకాలకు పాల్పడే వీ.డీ.సీల ఆగడాలకు ముకుతాడు వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే, డీ.ఆర్.ఓ గీత, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, నిజామాబాద్, ఆర్మూర్ ఏ.సీ.పీలు ప్రకాశ్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, బీ.సీ కమిషన్ అధికారులు సునీత, ఇర్ఫాన్, సతీష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాయికుమార్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
