. . . కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్
కామారెడ్డి, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే రైతులను, ప్రజలను నిండా ముంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడవ సారి అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 3 లక్షల 24 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల చట్టం చేసి అమలు చేస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో కూడా చట్టబద్ధత తేలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంద శాతం చేశామని నిరూపిస్తే నేను ముక్కు నెలకు రాస్తా అని ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టడం జరిగిందని, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పంటలకు పెట్టే సమయంలో కాకుండా పంటలు కోసేటప్పుడు ఇస్తుందన్నారు. ఎన్నికల సమయంలో పెంచుతామని చెప్పిన వృద్దాప్య, వికలాంగుల, సంక్షేమ పెన్షన్లు ఏమయ్యాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై సంతకం చేసిన పత్రం నీకు దొరకడం లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఎన్నికల సమయంలో దేవుళ్ళపై ఓట్లు వేసి దేవుళ్ళను సైతం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలపై ఈ రెండు రోజుల్లో పార్టీ తరపున అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా పేదలకు అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, కుంభాల రవి, హనుమాన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.