Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 7:23 pm Posted by : ramakrishna

బీఎల్ఓలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఈ నెల 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, 1200 లకు పైగా ఓటర్లు ఉన్న చోట కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇదివరకు 1500 వరకు ఓటర్లు ఉంటే ఒక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 1200 లోపు ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలతో కూడిన ప్రతిపాదనల జాబితాను ఈ నెల 20వ తేదీ లోపు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా అవసరమైన చోట కొత్తగా బూత్ లెవెల్ అధికారులను నియమించాలని, వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థానికులై ఉండాలని, ఒకవేళ అందుబాటులో లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలను నియమించవచ్చని తెలిపారు. ఎస్.ఎస్.ఆర్-2026 ప్రక్రియ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని, ఈ నెల 15 వ తేదీ లోపు తమకు వివరాలు సమర్పించాలని సీఈఓ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్ కాంత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.