. . . పనికి తగ్గ వేతనం ఇవ్వండి
. . .కొనసాగుతున్న కార్పొరేషన్ నాన్ పీహెచ్ వర్కర్ల నిరసన
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్ట్రీట్ లైట్ వర్కర్స్ గా పని చేస్తున్న నాన్ పీహెచ్ వర్కర్లు తమను ఎలక్ట్రిషియన్లుగా గుర్తించాలని కోరుతున్నారు. తాము బల్ధియాలో వీధి దీపాల వెలుగులు పంచడంలో స్తంబాలను ఎక్కి స్ట్రీట్ లైట్ల బిగింపుతో పాటు మరమ్మత్తులను చేయడం వీధి దీపాలను వెలిగించడం, ఆర్పడం వంటి పనులు చేస్తున్నామని ఎలక్ట్రిషియన్ గా గుర్తించాని డిమాండ్ తెరపైకి తెచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి నాన్ పీహెచ్ వర్కర్ గా విధుల్లో చేరినా ఇప్పటికి ఎలక్ట్రిషియన్ పనులు చేస్తున్నామని తమకు పనికి తగ్గ వేతనం రావడం లేదని, తాము చేస్తున్న పనికి గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఔట్ సోర్సింగ్ స్ట్రీట్ లైట్స్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నాచౌక్ లో నిరసనకు దిగారు.
జీవో 60, జీవో 63 ప్రకారం సీడీఎంఏ ఉత్తర్వులను అనుసరించి తమను నాన్ పీహెచ్ వర్కర్లుగా కాకుండా ఎలక్ట్రిషియన్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న స్ట్రీట్ లైట్ వర్కర్లకు ప్రతి నెల వేతనం రూ.19,500 చెల్లిస్తుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.16500 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సర్వీసు కాలం దశాబ్ధం పై అనుభవం ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం ఇప్పటికి పెరుగడం లేదని వాపోతున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమితులమయ్యామని, స్కిల్స్ లేవని, అర్హత లేదని తెలుపడంతో కార్మిక శాఖ అధికారుల సూచనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మొదలుకుని డిప్యూటీ కమిషనర్, డిఈ వరకు అనుమతి తీసుకుని న్యాక్ లో శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. తాము శిక్షణ పూర్తి చేసుకుని స్కిల్డ్ వర్కర్ గా సర్టిఫికెట్లను సమర్పించిన వేతనాలు మాత్రం పెరుగలేదని వాపోయారు. ఈ విషయంలో బల్ధియా అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే నిరసన చేస్తున్నట్లు తెలిపారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పరేషన్ లలో 60 డివిజన్ లలో దాదాపు 24 మంది సిబ్బంది స్ట్రీట్ లైట్ వర్క్ లో పని చేస్తున్నారు. ఏళ్ళ తరబడి అనుభవం పని చేసిన రికార్డులు ఉన్నా వేతనాలు లేవని పని భారం తగ్గడం లేదని బాధను వెల్లగక్కుతున్నారు. గతంలో అధికారులు ఇచ్చి,న హామీని అమలు చేయాలని, సీడీఎంఏ ఆదేశాలు అమలు చేయాలని కోరితే బల్ధియా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తాము నిరసన బాట పట్టడంతో బల్ధియా అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తాము చేయాల్సిన స్ట్రీట్ లైట్ పేనులను ఇతర సిబ్బందోత పని చేయించడమే కాకుండా ఆందోళన విరమించుకపోతే విధుల నుంచి తొలగించి కొత్త వారిని నియమిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళుగా పని చేస్తున్న వారు మొదలుకుని 15 ఏళ్ళు, 10 సంవత్సరాల సర్వీసు ఉన్న వారిని వేతనాలు పెంచాలని, ఎలక్ట్రిషియన్లుగా గుర్తించాలని, పని భారం తగ్గించాలని కోరుతుంటే ఉద్యోగ భద్రత లేదని, అర్హతల సాకు చూపి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన కొనసాగిస్తామని తెలుపుతున్నారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రజాసంఘాలు, ప్రజలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.
