Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 6:30 pm Posted by : ramakrishna

జుక్కల్ అభివృద్ధి బాధ్యత నాదే

  • వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినపుడే నిజమైన అభివృద్ధి
  • తెలంగాణ వచ్చినా పదేళ్లలో బాగు పడ్డది నలుగురే
  • ఫామ్ హౌస్ కు రోడ్లు వేసుకున్న కేసీఆర్ జుక్కల్ ప్రాంతాన్నిఎందుకు పట్టించుకోలేదు
  • కూతురుకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చినిరుద్యోగులను పట్టించుకోలే
  • జుక్కల్ పర్యటనలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

 

బిచ్కుంద, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. మద్దెలచెరువు – పిట్లం రోడ్,తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి,బిచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పిట్లం,బిచ్కుంద లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మికాంత రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. జుక్కల్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని,ఇక్కడి ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యుడనన్నారు. జుక్కల్ లో డైనమిక్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావు ఉన్నాడని,ఇప్పుడు అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. ఆయనకు తోడుగా ఉంటానని నాకు ఇప్పుడు జుక్కల్ బాధ్యత కూడా తోడయిందని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి,ఇంచార్జి మంత్రి సీతక్క తో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాటిచ్చాడు. గత పదేళ్లలో కొడుకు, బిడ్డ, అల్లుడు

I am responsible for the development of Jukkal.

బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు కాదని గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రాకున్నా బాధపడలేదనీ..ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకున్నామో అవి నెరవేర్లేదన్నారు. వాళ్ళు ఏ నాడు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.ఇంకా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పదేళ్లుగా పేదవాడు ఇల్లు కట్టుకోలేదు. డబుల్ బెడ్రూం ఇవ్వలేదు.దళితున్ని సిఎం చేయలేదు. కానీ ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రూ 5 లక్షలు ఇస్తున్నామని వచ్చే నాలుగేళ్లలో ప్రతి పేద వానికి ఇందిరమ్మ ఇల్లు కల సాకారం చేస్తామని స్పష్టం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని,జుక్కల్ లాంటి వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినపుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లన్నారు. నిరంతరం మమ్మల్ని విమర్శించే హరీష్ రావు వచ్చి జుక్కల్ రోడ్లు చూడాలన్నారు. ఆయన పాత జిల్లాలోని నారాయణ ఖేడ్ కు రూ. 240  కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంత లెండి, నాగమడుగు ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నారాయణ ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తామని,పలు సబ్ స్టేషన్లు మంజూరు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను,స్థానిక ఎమ్మెల్యే తో కలిసి తాను స్వయంగా కలుస్తానని మాటిచ్చారు. జుక్కల్ లో అడుగడుగున మంత్రికి జన నీరాజనం పలికారు. దారి వెంట మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వారితో పాటు నడుస్తూ పార్టీ శ్రేణుల్లో మంత్రి ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి,సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర,ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్,కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్,పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

I am responsible for the development of Jukkal.