Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 7:36 pm Posted by : ramakrishna

వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా పూర్తి సన్నద్ధం

. . . మంత్రి పొన్నం ప్రభాకర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాబోయే వర్షాకాలంలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు హైడ్రా పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం జలవిహార్‌లో నిర్వహించిన హైడ్రా మాన్సూన్ రెస్పాన్స్ బృందాల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అడిషనల్ డైరెక్టర్ పాపయ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు హైడ్రా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి హైడ్రా ముందుండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. హైడ్రాకు అత్యాధునిక యంత్రాలు, భారీ డీ-వాటరింగ్ పంపులు, అత్యవసర స్పందన వాహనాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నగరంలో వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.

 

HYDRA is fully prepared to tackle monsoon-related disasters.

 

హైడ్రా ఏర్పాటు అనంతరం విపత్తు నిర్వహణ, పట్టణ వరదల నివారణ, చెరువులు, నాలాలు మరియు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరవ్యాప్తంగా గుర్తించిన 913 నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు, 300 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, 889 స్టాటిక్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు. చెట్లు కూలిన ఘటనలకు తక్షణ స్పందన కోసం 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు వేగంగా తొలగించేందుకు 371 డీ-వాటరింగ్ పంపులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 60 ఫ్లైఓవర్లు, 38 అండర్‌పాస్‌లు, 705 చెరువులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అమీర్‌పేట్, మైత్రీవనం, మధురానగర్, ప్యారడైజ్–పట్నీ–రసూల్‌పురా నాలా మార్గాల్లో చేపట్టిన పూడిక తొలగింపు, ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ పునరుద్ధరణ పనుల ఫలితంగా వర్షపు నీటి ప్రవాహం మెరుగుపడి వరద ముప్పు గణనీయంగా తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, అగ్నిమాపక, వాతావరణ శాఖలు 24 గంటల పాటు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల రక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి, వర్షపు నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతి కాలనీ, ప్రతి సంస్థలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడం, నాలాల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ఏడాది జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో హైడ్రా చేపట్టిన డీసిల్టింగ్, నాలాల మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించానని, వాటి ఫలితాలు వర్షాకాలంలో స్పష్టంగా కనిపించాయని మంత్రి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, హైడ్రా అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని వరదల నుంచి రక్షించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే హైడ్రా ప్రధాన బాధ్యత అని పేర్కొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, వర్షాకాలాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. హైడ్రా పనితీరును ప్రశంసించిన ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత కృషి చేయాలని సూచించారు.

 

HYDRA is fully prepared to tackle monsoon-related disasters.