. . . హైదరాబాద్ ప్రైవేట్ కాలేజ్ ల దుశ్చర్య
. . . ఎన్ఓసిల కోసం బరి తెగించిన కాలేజ్ లపై కేసులు
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్‌లో ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సంబంధించిన భారీ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా సృష్టించి, తప్పుడు నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) సమర్పించినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత ఎనిమిది జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం, హైడ్రా నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు పొందకుండా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీ సర్టిఫికెట్లు రూపొందించారు. అనంతరం ఆ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు అఫిలియేషన్ కోసం దరఖాస్తులతో పాటు సమర్పించినట్లు తేలింది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా హైడ్రా అధికారులతో కలిసి పత్రాలను ధృవీకరించగా, సర్టిఫికెట్లు పూర్తిగా నకిలీవని బయటపడింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన హైడ్రా అధికారులు ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ లేక్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చాంద్రాయణగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజ్, బర్కత్‌పురలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్‌ఆర్ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ పేర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇదే తరహాలో సమర్పించిన మరో 60 కళాశాలల ఎన్‌వోసీలను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.