- విద్యాశాఖ అనుమతులు నిల్
- కొత్త అడ్మిషన్లు ఫుల్
- మొన్న సిబిఎస్ఈ అనుమతి పేరిట మోసం
- నేడు కిడ్స్ బ్లాక్ పేరుతో మరోసారి తెర పైకి ప్లే స్కూల్
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరిట జరుగుతున్న విద్యా వ్యాపారం పై విమర్శల వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు సమీపంలో ఉండి లేని అనుమతులు ఉన్నాయని అడ్మిషన్ల ప్రక్రియ జరుపుతు ఇప్పుడు తరగతులు నిర్వహించడంపై చర్చ జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో గత ఏడాది ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొలుత హైస్కూల్ కు సిబిఎస్ఈ బోర్డు అనుమతి ఉందని అడ్మిషన్లను తీసుకున్నారు. తీరా విద్యార్థులకు తరగతులను కుడా సిబిఎస్ఈ కరిక్యూలం అని బోదించారు. కాని అనుమతుల విషయంకు వచ్చే సరికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే తీసుకుని విద్యార్థులను ముంచేశారు. స్టేట్ బోర్డు విద్యా బోదనతో పాటు, అనుమతులు స్థానికంగా ఉండి సిబిఎస్ఈ విద్యా పేరిట తల్లిధండ్రుల నుంచి వేలాది రూపాయాలు గుంజారు. ఈ విషయంపై విద్యార్ధి సంఘాలు ప్రశ్నించడంతో వారి నోరు మూసివేశారు. విద్యాశాఖాధికారులను మచ్చిక చేసుకుని ఈ విషయాన్ని మరుగున పరిచారు.
గత ఏడాది సిబిఎస్ఈ విద్యా పేరిట విద్యార్ధుల వారి తల్లిదండ్రులను రోడ్డున పడేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ప్లే స్కూల్ ను తెరిచింది. జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సంబంధిత పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడం విశేషం. హై స్కూల్ కు ఆనుకుని ఉన్న భవనాన్ని తీసుకుని అక్కడ నర్సరీ స్కూల్ రన్ కు చర్యలు చేపట్టింది. నర్సరీ కాని ప్లే స్కూల్ ఐనా విద్యాశాఖా అనుమతి తప్పని సరి. కాని ఎలాంటి అనుమతులు లేకుండా ప్లే స్కూల్ నిర్వహణకు పాత భవనానికి కొత్త రంగులు అద్దుతున్నారు. పురాతన భవనంలో పిల్లల పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ గాని, ఫైర్ సెఫ్టీ సర్టిఫికేట్ లు గాని తమకు ఉన్నవి లేనివి తెలుపకుండానే అడ్మిషన్ లను చేపట్టడం గమనార్హం. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ కిడ్స్ బ్లాక్ కు అనుమతుల విషయంలో నిజామాబాద్ జిల్లా విద్యశాఖాధికారులను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్ లను తీసుకుంటున్నారని తెలుపడం విశేషం.