. . . భవనంపై నుంచి తోసేసి గొంతు నులిమి హత్య
. . . ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం
. . . భార్యతో పాటు ప్రియుడి అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భవనంపై నుంచి తోసేసిన చనిపోకపోవడంతో గొంతు నులిమి హత్య చేసింది భార్య. ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడడమే కాకుండా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడని అంత్యక్రియలు చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ సవితి తల్లి తన తండ్రిని హత్య చేసిందని కొడుకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణలో ఈ విషయం బట్టబయలైంది. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ కు గుగులోతి యమునా రెండవ భార్య. యమునాకు అదే గ్రామానికి చెందిన నునావత్ నందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల 6న గుగులోత్ శంకర్ దాబాపై నుంచి కిందకు దిగుతుండగా అతని రెండవ భార్య యమునా అతన్ని మెట్లపై నుంచి తోసేసింది. కిందపడిన శంకర్ చనిపోకపోవడంతో తన ప్రియుడైన నందుతో కలిసి ఇంట్లోకి తీసుకెళ్లి శంకర్ గొంతునులిమి హత్య చేశాడు. అయితే బిల్డింగ్ మెట్లపై నుంచి పడడం వల్ల శంకర్ చనిపోయాడని అందరినీ నమ్మించి 7న అంత్యక్రియలు నిర్వహించింది. అయితే అతని కొడుకు గుగులతో రమేష్ ఫిర్యాదు మేరకు మాక్లూర్ పోలీసులు కేసు న మోదు చేశారు. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది విచారణ జరిపి గుగులోత్ యమునా , ఆమె ప్రియుడు నునావత్ నందులను అదుపులోకి తీసుకుని విచారించడంతో తామె శంకర్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, రాడ్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు.