నందిపేట్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు చర్చల ద్వారా పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ర్యాలీలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, నందిపేట్ ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారీ, విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోనం వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నందిపేట్ కన్వీనర్ గంగాధర్ మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా దేశానికి విశేష సేవలు అందించిన సోనం వాంగ్‌చుక్ ఆందోళనను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని గంగాధర్ అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతున్న నిరాహార దీక్షను గౌరవించి, ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఆహ్వానించి ఆయన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.