. . . బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జిగా గాండ్ల సుధీర్ కుమార్ నియామకం
బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు నమోదయ్యాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హన్మండ్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ తాహిర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న వారికి పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన కామరెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సబ్బిడి రమేష్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జిగా గాండ్ల సుధీర్ కుమార్, బోర్లం గ్రామ కమిటీ అధ్యక్షులుగా గాండ్ల అశోక్ లను నియమించి వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్బంగా బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి గాండ్ల సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, అధికారంలోకి వస్తే, ప్రజల కోసం పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామన్నారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు. బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే నినాదంతో తీన్మార్ మల్లన్న ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. పార్టీ కార్యవర్గం అంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకుందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలా కాపాడుకుంటానని తెలిపారు. తనపై నమ్మకంతో తనకు బాద్యతలు అప్పగించినందుకు తీన్మార్ మల్లన్నకు ఈ సందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం రాజు, రైతు విభాగం అధ్యక్షులు సింగారపు సిద్దయ్య, పిడిఎస్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.