Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 9:37 pm Posted by : ramakrishna

తెలంగాణ విశ్వవిద్యాలయంపై కోర్టు ఉత్తర్వులు అమలు ఎలా?

  • ఉత్తర్వులు రాలేదంటున్న అధికారులు
  • పోస్టుల రద్దుపై తర్జనభర్జనలు
  • కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో జరిగిన ఆచార్యుల భర్తీ వ్యవహరం సక్రమంగా జరుగలేదని వాటిని రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఉన్నత విద్యామండలితో పాటు రాష్ట్ర అధికారులు, తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2025 అక్టోబర్ 31న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న 2012 -2013 నాటి మూడు నోటిఫికేషన్ల వ్యవహరం తెయూ అధికారులను కంటినిండా నిద్రలేకుండా చేస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన సమయంలో ఆనాటి రాజకీయ ప్రోద్భలంతో అండర్ టేకింగ్ (పీహెచ్ డి) అర్హతలు లేని అధికారులు కొందరు నిజామాబాద్ జిల్లాలో ఏర్పడిన నూతన విశ్వవిద్యాలయంలో కాలుపెట్టారు. ఆనాటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సామాజిక వర్గానికి చెందిన వారిమని కాలుపెట్టిన కొందరు కేవలం తమ కులానికి చెందిన వారిని అర్హతలు లేకపోయినా భర్తీ చేశారు. యూజీసీ నిబంధనలకు విరుద్దంగా అండర్ టేకింగ్ పేరుతో ఉద్యోగాల్లో చేరి దూర విద్య ద్వారా చదివినట్లు (యూజీసీ) గుర్తింపు లేని విద్యా సంస్థల్లో చదివినట్లు సర్టిఫికెట్లను తీసుకువచ్చి ప్రొఫెసర్లు మొదలుకుని అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. ప్రధానంగా వారు విధుల్లో ఉండగానే సంబంధిత సర్టిఫికెట్లను పొందడం విశేషం.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిన విషయం తెల్సిందే. తెయూలో ప్రవేశపెట్టబోయే ఫార్మాసుటికల్, అప్లయిడ్ ఎకనామిక్స్ కోర్సుల్లో ప్రవేశానికై నోటిఫికేషన్  జారీ చేసిన విషయం తెల్సిందే. ఆయా కోర్సుల్లో బోధన కోసం ఆచార్యుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను యూనివర్సిటీ అధికారులు ఇష్టారీతిన మార్చేసిన విషయం తెలిసిందే. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా నియామకాలను చేశారు. దానిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా పుష్కరకాలం తర్వాత న్యాయస్థానం తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు చేసిన నియామకాలు చెల్లవని తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ విషయంలో న్యాయస్థానం తీర్పును అమలు చేసేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆనాడు కులప్రాతిపదికన లక్షల రూపాయలు వసూళ్ళు చేసి నియామకాలు చేసిన అధికారులు రిజర్వేషన్లను విస్మరించడంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఉపకులపతి ఏసీబీకి చిక్కిన దాఖలాలు లేవు. తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రవీంధర్ గుప్త రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కిన ఉదంతం ఉంది. ఆనాడు ఆయన హయంలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. లక్షల రూపాయలు చేతులు మారిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో దాదాపు 53 మంది అధ్యాపకులను తొలగించాల్సిన అవసరం న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఏర్పడింది. కానీ తెయూలో నియామకాల సమయంలో లక్షల రూపాయల లంచాలను మెక్కిన అధికారులు వారిని ఏ విధంగా పక్కకు తప్పించాలని తలలు పట్టుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల వరకు చేతులమారిన వ్యవహరం ఉంది. ఈ విషయంలో వైస్ చాన్స్ లర్ మొదలుకుని రిజిస్ట్రార్ల వరకు తలపాపం తిలపిడకడన్న చందంగా వాటాలు ఉండడంతో వారిని ఏ విధంగా తప్పించాలని కిందామీద పడుతున్నారు. ఎందుకంటే ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కూడా అధికారంలో ఉండడమే కారణం. ఆనాడు ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత పోస్టులను అప్పగించిన ఘనుడు ప్రస్తుతం కూడా పైరవీ చేయడం విశేషం. కొందరు విద్యార్థి సంఘాల నాయకులను ఉసిగొల్పి ఆందోళన చేయించడం కూడా అందుకు ఉదాహరణగా చెప్పాలి. కనీసం పీజీలు లేకున్నా, అర్హత లేకున్నా ట్యూటర్లుగా చేరిన విద్యార్థి సంఘాల నాయకులు తర్వాత తెయూలో ఆచార్యులుగా రాణించడం వెనుక అవినీతి, అక్రమాలకు వెన్నుదన్నుగా ఉండడమే కారణమని చెప్పాలి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే పీహెచ్ డిలు పొందిన వారు నేడు యూనివర్సిటీలోనూ అధికారులుగా పెత్తనం చెలాయించడం వెనుక బినామీ అధికారుల ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతుంది.