Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 10:45 pm Posted by : ramakrishna

మనమెంత భద్రం? 

. . అబిడ్స్ లో నాలుగు దుకాణాలు అగ్నికి ఆహుతి

. . . నిజామాబాద్ నగర నడిబొడ్డున హోల్ సెల్ వ్యాపారం 

. . . కోట్లలో సరుకులు. . . టన్నులలో నిల్వలు

. . . ఏడాదికొకసారి గుర్తుకొచ్చేది సురక్షిత చర్యలు

నిజామాబాద్, బతుకమ్మ : పటాకుల నిల్వ ప్రాణాలతో చెలగాటం. అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆస్తి  నష్టంతో పాటు ప్రాణనష్టం పరిపాటి. కానీ ప్రతియేడాది దీపావళి సమయంలోనే మనం  సురక్షితమా అనే చర్చ నిజామాబాద్ వాసులను కలవరపెడుతుంది. అందుకు కారణం కిసాన్ గంజ్ (దాల్ గల్లీ). నిజామాబాద్ నగరం నడిబొడ్డున రెండు వైపులా మార్కెట్ తో పాటు అత్యంత జనసమర్థమైన ప్రాంతంలో టన్నులకొద్ది పటాకులను నిల్వ చేయడం, కోట్లాలో విక్రయాలు చేయడం పరిపాటిగా సాగుతుంది. గత మూడు దశాబ్ధాలకు పైగా కిసాన్ గంజ్ ద్వారానే హోల్ సేట్ పటాలకు విక్రయాలు సాగుతున్నాయి. ఏడాది  పొడవునా టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతంగా ప్రసిద్ది చెందింది ఆ  ప్రాంతం.రెండు  రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆబిడ్స్ (బొగ్గుల కుంట)లో జరిగిన అగ్నిప్రమాదం నాలుగు దుకాణాలను అగ్నికి అహుతి చేసింది. అక్కడ ప్రాణనష్టం తప్పిన కోట్లాలో ఆస్తి నష్టం తప్పలేదు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పటాకుల వ్యాపారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు టపాసుల విక్రయాలకు కేంద్రంగా ఉన్న కిసాన్ గంజ్ లో కోట్ల విలువైన  సరుకును టన్నులకొద్ది నిల్వ చేయడం ఉదాహరణగా చెప్పాలి. పేరుకు హోల్ సేల్ వ్యాపారమని తమ గోదాములు నగర శివారుకు తరలించామని అక్కడ గోదాములను చూపుతున్నా దాల్ గల్లీలో మాత్రం అంతే స్థాయిలో సరుకులను  నిల్వ చేయడం అందరినీ  కలవరపెడుతుంది. ఇరుకు దుకాణాల్లో సరుకులను నిల్వ చేసి అక్కడే క్రయవిక్రయాలు చేస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులనే  ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టపాసుల క్రయవిక్రయాలపై నియంత్రణలు తెచ్చారు. అనాడు హోల్ సేల్ వ్యాపారులను తరలించాలంటూ ఆర్డీవో ద్వారా నోటీసులు జారీ చేశారు. కానీ వ్యాపారులు వినలేదు కదా అధికారులపై ఒత్తిడి తెప్పియడంతో దందా మాత్రం యదావిధిగా సాగుతుంది. ప్రతియేడాది దీపావళి పండుగ  సందర్భంగా కిసాన్ గంజ్ లో జరుగుతున్న వ్యాపారం  చర్చకు రావడం పరిపాటిగా మారింది. కానీ అక్కడ ఎలాంటి సురక్షిత వ్యాపారం కోసం చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండవు. కిసాన్ గంజ్ లో పెద్ద మొత్తంలో ఉన్న హోల్ సేల్ వ్యాపారంపై నియంత్రణ లేకపోవడంతో అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ఇటీవల వరకు పటాకుల విక్రయాల కోసం మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అనుమతి  తప్పనిసరి చేశారు.  బహిరంగ ప్రదేశాల్లో విక్రయాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరి జనసామర్థ్యం  ఉన్న కిసాన్ గంజ్ లో జరుగుతున్న వ్యాపారంపై జిల్లా అధికార యంత్రాంగం కానీ  పోలీసు యంత్రాంగం కానీ స్పందించకపోవడం పలు ఆరోపణలకు కారణమౌతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాని నియమనిబంధనలు కేవలం  పండుగ పూట చేస్తున్నారన్న విమర్శలుండడమే. దశాబ్ధాలుగా జరుగుతున్న వ్యాపారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన  పాలకులు  ఒత్తిడికి గురై ప్రజల ప్రాణాలను ఫణంగా  పెడుతున్నారన్న వాదనలున్నాయి. ఈసారి  పండుగ సీజన్ ముందుగానే  ప్రారంభం కాగా క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇది వరకే స్పందించాల్సిన అధికార యంత్రాంగం  పట్టించుకోక ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్న వాదనలు లేకపోలేదు. పండుగకు రెండు  మూడు రోజులు ముందుగా హడావుడి  చేయడం ఎందుకు అని, దాని వెనుక మతలబు ఉందన్న వాదనలున్నాయి.