Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 7:11 pm Posted by : ramakrishna

నేటి నుంచే ఇంటింటి కుటుంబ సర్వే

నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విద్యా ఉపాధి కుల వివరాల సేకరణకై ఈ నెల 6 నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఇళ్ళ జాబితా( హౌజ్ లిస్టింగ్) రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసి ఎన్యుమరేషన్ బ్లాక్ లను పక్కాగా గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, డెటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగింది. ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులను మధ్యాహ్నం 1 గంట తర్వాత సర్వేలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇంటింటికి కుటుంబ సర్వే శిక్షణ పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీల పరిధిలో సర్వే నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 3245 ఎన్యుమరేషన్ బ్లాక్ లుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో 3236 మంది ఎన్యుమరేటర్లను నియమించగా 107 మందిని రిజర్వులో ఉంచారు. మొత్తం 3343 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. 369 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఒక్కరిని రిజర్వులో ఉంచి మొత్తంగా 370 మందిని సూపర్ వైజర్ల పర్యవేక్షణలో ఈ సర్వే జరుగనుంది. ఆర్మూర్ డివిజన్ లో 934 ఎన్యుమరేషన్ బ్లాక్ లలో, బోధన్ లో 564, నిజామాబాద్ డివిజన్ లో 715 ఎన్యుమరేషన్ బ్లాక్ లలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగనుంది. మూడు డివిజన్ లలో 2213 బ్లాక్ లలో మున్సిపాలిటీల విషయానికొస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 725, ఆర్మూర్ మున్సిపాలిటీలో 140, భీంగల్ మున్సిపాలిటీలో 29, బోధన్ మున్సిపాలిటీలో 138 బ్లాక్ లలో సర్వే జరుగనుంది. మొత్తంగా 3245 బ్లాక్ లలో సర్వే పకడ్బందీగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇంటింటికి సర్వే కోసం స్టిక్కరింగ్ కార్యక్రమం జరిగింది. ఆయా ప్రాంతాలలో సర్వేను ఇంటింటి వారీగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాటు చేసింది.