Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:34 pm Posted by : ramakrishna

వాట్సప్‌ వీడియో కాల్‌తో హనీట్రాప్‌

 

. . . సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నుంచి రూ.9.29 లక్షలు వసూలు

 

. . . సైబరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సైబర్‌ మోసం

 

. . . కేసు నమోదు చేసిన పోలీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

సైబరాబాద్‌ పరిధిలో హనీట్రాప్‌ ద్వారా ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను మోసం చేసి సైబర్‌ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగిలోని రాజపుష్ప ప్రొవిన్షియాలో నివసిస్తున్న 23 ఏళ్ల సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌కు ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని ఓ మహిళ నుంచి వాట్సప్‌ వీడియో కాల్‌ వచ్చింది. వీడియో కాల్‌లో ఆమె అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, బాధితుడిని కూడా అలాగే చేయాలని ప్రేరేపించింది. కాల్‌ ముగిసిన కొద్దిసేపటికే అదే నంబర్‌ నుంచి మరోసారి కాల్‌ వచ్చింది. ఈసారి ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ బాధితుడిని బెదిరించాడు. వీడియో కాల్‌ను రికార్డు చేసి, దానిని ఎడిట్‌ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామని డబ్బులు డిమాండ్‌ చేశాడు. అంతేకాకుండా బాధితుడి సోదరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు వీడియో పంపినట్లు చూపిస్తూ స్క్రీన్‌షాట్‌లను పంపించాడు. దీంతో భయాందోళనకు గురైన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నిందితులు అడిగిన విధంగా డబ్బులు చెల్లించాడు. మొదట రూ.82 వేలు, అనంతరం రూ.1.40 లక్షలు, మరోసారి రూ.2.60 లక్షలు పంపించాడు. అయినప్పటికీ బెదిరింపులు ఆగకపోవడంతో పలుమార్లు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.9.29 లక్షలకు పైగా కోల్పోయాడు. చివరకు ధైర్యం తెచ్చుకున్న బాధితుడు జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఒక నిందితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతాను అధికారులు బ్లాక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకుండా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు లేదా జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.